శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాగమంతా పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాల నిర్వహణ పైనే ఫోకస్ పెట్టారు. టీటీడీ ఈవో, అదనపు ఈవోలు ఎప్పటికప్పుడు తిరుమలలో పర్యటిస్తూ బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక విషయాన్ని తెలియజేసింది. అక్టోబర్ 8న తిరుమలకు వచ్చే వారు ద్విచక్ర వాహనాలపై మాత్రం రావొద్దని సూచించింది.
ఈ సంవత్సరం తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్టోబర్ 8న శ్రీవారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరుగనుంది. ఆ రోజున గరుడ వాహన సేవకు భారీగా భక్తులు విచ్చేయనున్నారు. ఈ క్రమంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అక్టోబరు 8న టీటీడీ రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. అక్టోబర్ 8న ముఖ్యమైన గరుడ సేవ నిర్వహించనున్నారు. కాబట్టి అక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవని టీటీడీ తెలిపింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.