హిందువులంతా ప్రకృతికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. ప్రకృతిలో భాగమైన చెట్లు, మొక్కలకు నిత్య పూజ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మకు ఎర్రటి పూలతో పాటు జమ్మి ఆకులను సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. నవరాత్రి జరుపుకున్నన్ని రోజులూ నిత్యం ఎర్రటి మందారాలతో దుర్గమ్మను పూజిస్తారు. నిత్యం ఒక్కటైనా మందార పువ్వ, అలాగే శమీ చెట్టు ఆకులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అపారమైన అనుగ్రహాన్ని మనం పొందుతామట. తద్వారా మన ఇంట కష్టాలన్నీ తొలగిపోయి సుఖ శాంతులు నెలకొంటాయని పండితులు చెబుతారు.
పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుంచి బంగారు నాణేలను అందుకున్నాడట. అప్పటి నుంచి దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించే సంప్రదాయం కొనసాగుతోందనేది ఒక కథనం. మరో కథనం కూడా ఉంది. శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు శమీ వృక్షాన్ని కూడా పూజించాడట. అలాగే పాండవుల మధ్యముడైన అర్జనుడు అజ్హాతవాసానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టుపై తన ధనస్సును దాచుకున్నాడట. అలాగే దసరా రోజున జమ్మి చెట్టు మీద నుంచి తన ధనస్సుని తీసుకున్నాడట. కాబట్టి దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం సంప్రదాయంగా వస్తోంది. దసరా రోజున జమ్మి చెట్టును పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం.