కాశీ పట్టణంలో ఎటు చూసినా ఏదో ఒక స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. అన్ని దేవాలయాలకు చక్కగా జీవించాలని వెళితే.. కాశీకి మాత్రం మరణించాలని వెళుతుంటారు. ఎందుకంటే కాశీలో మరణిస్తే తప్పక కైలాసం చేరుకుంటామని నమ్మకం. కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి మాత్రమే కాకుండా ఎన్నో ఆలయాలున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సూర్య భగవానుడి ఆలయాలను మనం ఎక్కడో కానీ చూడలేం. అలాంటిది కాశీలో మాత్రం ఏకంగా 12 సూర్య దేవుని ఆలయాలను చూడవచ్చు.
ఆసక్తికరంగా ఒక్కొక్క ఆలయంలో ఒక్కో పేరుతో సూర్య భగవానుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు అక్కడి ఆలయాలన్నింటినీ దర్శించుకుంటూనే ఉంటాం. ఇక తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో యమాదిత్యుడి ఆలయం ఒకటి. శ్రీనాథుడు కాశీ ఖండంలో యమాదిత్యుని ఆలయ విశేషాలను ప్రస్తావించారు. కాశీ సింథియా ఘాట్‌లోని సంకట దేవి ఆలయానికి సమీపంలో ఉంటుంది యమాదిత్య ఆలయం. కాశీకి వెళ్లిన వారు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి మరణానంతరం యమ యాతనలను అనుభవించవలసిన ఇబ్బంది ఉండదట.