ఈ వినాయకుడిని దర్శించుకుని ప్రసాదం స్వీకరిస్తే సంతానం తప్పక కలుగుతుందట..

మన ఇంట్లో శుభకార్యం ఏది జరిగినా.. పూజా కార్యక్రమాలు నిర్వహించినా ముందుగా మనం గణేషుడికి పూజ చేసుకుంటాం. వ్రతం చేపట్టినా కూడా తొలి పూజ విఘ్నేశ్వరుడికి చేశాకే మొదలు పెడతాం. అప్పుడే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నమూ కలగకుండా ఉంటుంది. ఇక వినాయకుడి ఆలయానికి ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంటాయి. ఇలాంటి క్షేత్రాల్లో కొన్ని బాగా ప్రసిద్ధి చెందాయి. ఇక మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ తాలూకాలో ఉన్న మహ్ద్ గ్రామంలో అష్ట వినాయక దేవాలయం ఉంది. ఈ క్షేత్ర సముదాయంలో నాలుగవది వరద వినాయక క్షేత్రం. ఈ ఆలయానికి వెళితే సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం.

ఈ వరద వినాయకుడు కోరిన వరాలను కాదనకుండా ఇస్తాడట. ఈ క్షేత్రంలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయంలో మాఘ చతుర్థి నాడు ప్రత్యేక పూజ జరుగుతూ ఉంటుంది. ఈ పూజలో పాల్గొని ఇక్కడ ప్రసాదంగా స్వీకరించిన కొబ్బరికాయను తీసుకుని కొబ్బరిని తింటే చాలు తప్పక పుత్ర సంతానం కలుగుతుందట. అందుకే సంతానం లేని వారంతా ఈ ఆలయానికి మాఘ చతుర్థి నాడు పోటెత్తుతారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే వినాయకుడి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి నలుదిక్కుల్లో నాలుగు ఏనుగు విగ్రహాలు ఉంటాయి.

Share this post with your friends