
పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలియజేస్తోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్యవ్రతము త్యజించినచో మహాదోషము.
అవ్రతేన నయేద్‌యస్తు
చాతుర్మాస్యమనుత్తమం॥
సపాపీ నరకం యాతి
యావదాభూత సంప్లవం ॥
వ్రతము చేయకుండ ఎవరైతే ఈ చాతుర్మాస్యాన్ని గడిపెదరో అటువంటివారు మహా ప్రళయకాల పర్యంతము నరకములో పడతాడు. వ్రతము చేయుట వలన మహాపుణ్యము. శాకాదివ్రతములే కాక పరాకవ్రతము, షష్ఠకాల వ్రతము, ధారణ పారణ వ్రతము, లక్ష ఒత్తుల వ్రతము, భీష్మపంచకవ్రతము, లక్ష నమస్కార వ్రతము, లక్ష ప్రదక్షిణ వ్రతము, తులసీ, గో ప్రదక్షిణము, గోదానము ఇత్యాది వ్రతములు కూడా చేయుట వలన విశేష ఫలములు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
