ఈ శివుడి సన్నిధిలో కాసేపు గడిపితే కైవల్యం సిద్ధిస్తుందట..

మన దేశంలో శివాలయాలకు కొదువేమీ లేదు. ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. కొన్ని దేవాలయాలు అత్యంత ప్రసిద్ధి గాంచాయి. అలాంటి వాటిలో ద్రాక్షారామం ఒకటి. ఇక్కడ భీమేశ్వర మూర్తి భక్తులను నిత్యం ఆశీర్వదిస్తూ ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన భీమేశ్వరమూర్తి వెలిశాడు. ఈ భీమేశ్వరమూర్తి ఆలయ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఈ భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఈ భీమేశ్వర మహత్యాన్ని తెలిపే శ్లోకం కూడా ఒకటుంది. అదేంటంటే.. ‘కాశ్యాం తు మరణాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే..’

ఆ శ్లోకం అర్థం ఏంటంటే.. కాశీలో నివసించిన వారికి మరణానంతరం మోక్షం.. భీమేశ్వరుడిని పూజించి కొన్ని క్షణాలైన ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యంతో పాటు కైవల్యం సిద్ధిస్తుంది. ఈ భీమేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. అంతేకాకుండా పురాణాల్లోనూ ఈ క్షేత్రం ప్రస్తావన ఉందంటారు. పంచారామాల్లో ఒకటిగా ఇది పూజలందుకుంటోంది. వాస్తవానికి పంచారామాలకు ప్రసిద్ది గాంచిన తెలుగుసీమలో భీమేశ్వరం కూడా ఒకటి. ఇక్కడ, ద్రాక్షారామంలో స్వామివారు భీమేశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. అలాగే పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా.. అమరావతిలో అమరేశ్వరుడు, సామర్లకోటలో కొమరారామమూర్తిగా పూజలందుకుంటున్నాడు.

Share this post with your friends