ఈ ఆలయాల్లో గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన భాగ్యం తప్పక లభిస్తుందట..

కొన్ని ఆలయాల్లో ప్రసాదం స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని తెలుసుకున్నాం. అలాంటి ఆలయాల్లో చిలుకూరి బాలాజీ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ ఇచ్చే గరుడ ప్రసాదం కోసం మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి వెళుతుంటారు. అయితే అన్ని వేళలా ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఏడాదికి ఒక్కసారే ఇస్తారు. అది కూడా బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తుంటారు. దానిని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ క్రమంలోనే ఎంతో మంది మహిళలు పెద్ద ఎత్తున గరుడ ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు.

ఇక ద్వారకాతిరుమలలోనూ ఈ గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఇక్కడ ప్రస్తుతం ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అర్చకులు వేడుకగా జరుపుతారు. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా ముందుగా గరుడ పటంపై ఉన్న గరుత్మంతునికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. గరుత్మంతుని కోసం ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేసి సమర్పిస్తారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ముక్కోటి దేవతలను స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఆహ్వానం పలకడం. ఆ తరువాత గరుడ ప్రసాదాన్ని భక్తులకు సమర్పిస్తారు. దీనిని స్వీకరిస్తే తప్పక సంతానం లేని మహిళలకు సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం రోజుల పాటు మాంసాహారాలను మానివేయాలి. మూడు రోజుల ముందు నుంచే అత్యంత నిష్టగా ఉండాలి. తలస్నానం ఆచరించి గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు.

Share this post with your friends