
మనిషికి కోపం అనేది ఒక ఎమోషన్. దానిని కంట్రోల్ చేసుకోకుంటే జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. క్రోధం నుంచి అవివేకము, అవివేకం నుంచి మరపు కలుగుతున్నాయి. ఆ మరపు వలన బుద్ధి నాశనం జరిగి భ్రష్టత్వం కలుగుతోంది. అయితే స్వాధీన మనస్సుని కలిగి ఉన్న వారికి ప్రపంచ వ్యవహారములు జరుగుతున్నా అవి బాధించనందున మనో నిర్మలత్వము, మనఃశ్శాంతి లభ్యం అవుతున్నాయని భగవద్గీత చెబుతోంది. హృదయంలో కఠోరత్వం, సరిపడని భావాలను చేరనివ్వకుండా జాగ్రత్తపడాలి. వినయం, మృదుత్వం, సహనం అనే భూషణాలే నిన్ను రక్షిస్తాయని భగవద్గీత సైతం చెబుతోంది.
మహాత్ములు ఎటువంటి అవమానకర పరిస్థితులనైనా చలించక ఎదుర్కొని ఉన్నందునే ఆధ్యాత్మిక ఉన్నతులను సాధించగలుతారు. అందువలన మృదుత్వం, నిరోధం లేకుండుట అనే కవచాలను కలిగి ఉంటే సురక్షితంగా ఉండవచ్చు. సూక్ష్మంగా ఉండే సున్నితత్త్వమే చెరగని ముద్రలను వేయగలదు. కలహత్వపు విధానాలు శాశ్వతత్వాన్ని కలిగించలేవు. మనలో దయ, సహనం, మృదుత్వమనే గుణాలు వృద్ధి పొందాలని, మనం ఎవ్వరినీ గాయపరిచే విధంగా మాట్లాడకుండా ఉండేలా చేయుమని, హృదయాన్ని నీ ముందు పరుస్తున్నానని, దాని నుంచి స్వార్థాన్ని, కఠోరత్వాన్ని తొలగించి నీ ప్రేమతో నింపివేయుమని నిత్యం భగవంతుని ప్రార్థించాలి.
