భారతదేశంలో వినాయక క్షేత్రాలకు కొదువేమీ లేదు. అయితే ప్రతీ ఆలయానికి ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అష్ట వినాయక క్షేత్రాలున్నాయి. ఒక వృతం ఎక్కడ ప్రారంభిస్తామో తిరిగి ఎనిమిది వినాయక క్షేత్రాలను దర్శించుకుని అక్కడికే వచ్చి చేరుతామన్నమాట. ఈ అష్ట వినాయక క్షేత్రంలో ఎనిమిదవది రంజన్ గావ్ మహాగణపతి క్షేత్రం. మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని షిరూర్ తాలూకాలోని రంజన్ గావ్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని ఇప్పుడు కాదు.. 9 – 10 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు తెలుస్తోంది.చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో పేష్వాలు పునర్నిర్మించారు.
ఈ ఆలయ విశేషం ఏంటంటే.. ఈ ఆలయ నిర్మాణం. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై పడేలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఈ మహాగణపతి ఆలయంలో త్రికాల హారతులు, అర్చనలతో పాటు ప్రతి బుధవారం, ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతినెలా వచ్చే సంకష్టహర చవితి రోజు స్వామికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇక వినాయక చవితి పండుగ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.