మరికొద్ది గంటల్లో పుష్యమాసం రానుంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్య మాసమని పేరు వచ్చింది. ఈ పుష్యమాసం శనికి ప్రీతికరమైన మాసమట. ఎందుకంటే శనీశ్వరుడి జన్మ నక్షత్రం పుష్యమేనట. అందుకే ఈ మాసం ఆధ్యాత్మికత, ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేస్తుందట. ఈ నెలంతా శనీశ్వరుడిని పూజిస్తే ఆయన ప్రసన్నుడవుతాడట. మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా ఫలితాన్నిచ్చే ధర్మదేవతగా శనిని పిలుస్తారు. కాబట్టి ఈ మాసంలో శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవట.
పుష్యమాసం విశిష్టత ఏంటో ముందుగా తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రాన్ని అద్భుతమైన నక్షత్రంగా పేర్కొంటారు. ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుందట. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. కాబట్టి ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనము చేస్తుందట. తద్వారా మనస్సులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించి వేస్తుందట. కాబట్టి పుష్య మాసం.. మనకు బుద్ధి బలాన్ని, ప్రాణ బలాన్ని పుష్టిగా ఇస్తుందట.