
మాఘ మాసం అనగానే మనకు వివాహాలతో పాటు నదీ స్నానం కూడా గుర్తొస్తుంది. మాఘ మాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం ఇది వీలుపడని వారు తమ చెంతనే ఉన్న చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శిశిర ఋతువు ఆరంభంలో మాఘ మాసం వస్తుంది. ఈ మాఘమాసంలో బ్రహ్మ ముహూర్తానే లేచి నదీస్నానం ఆచరించాలట. ఇలా చేస్తే శాస్త్రీయ పరంగానూ.. సంప్రదాయం ప్రకారం కూడా చాలా మంచిదట.
మాఘ మాసంలో చేసే నదీ స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడం వలన మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. అంతేకాకుండా శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆరోగ్యవంతమైనవని అంటారు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. మాఘమాసంలో సూర్యోదయానికి ఇంట్లో సాధారణ స్నానం చేస్తే ఆరేళ్ల స్నాన ఫలం.. బావినీటి స్నానంతో పన్నెండేళ్లు.. చెరువు నీటి స్నానంతో 24 ఏళ్లు.. సాధారణ నది అయితే 96 ఏళ్లు.. పుణ్యనదీ జలాలైతే 9,600 ఏళ్ల పుణ్య స్నాన ఫలం.. సంగమ స్థానం అయితే 38,400 సంవత్సరాలు.. గంగానదిలో 3 కోట్లు 84 లక్షల సంవత్సరాలు.. సముద్ర జలం గురించి అయితే చెప్పడానికి మాటలు చాలనంత పుణ్యఫలం లభిస్తుందట.
