కాలం మారింది అన్ని గ్రామాలూ.. నగరాల్లోనూ మార్పులొచ్చాయి. కానీ అప్పట్లో రోడ్లు సరిగా ఉండేవి కాదు.. అభివృద్ధి ఏమీ ఉండేదే కాదు.. అయితే జగన్నాథుని రథ యాత్ర ఈనాటిది కాదు.. ఎప్పటి నుంచో జరుగుతోంది. ప్రస్తుతమైతే మూడు రథాలను ఈ కార్యక్రమం కోసం తయారు చేస్తారు. ఒక రథంపై జగన్నాథుడు కొలువైతే మరో రథంపై ఆయన సోదరి సుభద్రా దేవి.. మూడో రథంపై ఆయన సోదరుడు బలభద్రుడు కొలువై ఉంటారు. కానీ అప్పట్లో మూడు కాదు.. ఆరు రథాలు ఉండేవి. మరి ఆ ఆరు రథాలపై ఎవరిని తీసుకెళ్లేవారంటారా? ఈ ముగ్గురినే. కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంది కదా.. ఆ కథేంటో చూద్దాం.
అప్పట్లో జగన్నాథుని రథయాత్రను రెండు పార్టులుగా విభజించి మరీ నిర్వహించేవారు. కాబట్టి ఆరు రథాలను వినియోగించేవారు. దీనికి కారణం ఏంటంటే.. రథయాత్ర పూరి ఆలయం నుంచి ప్రారంభమై ఆయన అత్తవారింటి వద్ద ముగిసేది. ఈ మధ్యలో ఒక వాగు వచ్చేది. ఆ వాగుకు ఇవతల మూడు రథాలు.. అవతల మూడు రథాలను వినియోగించేవారు. జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి మూడు రథాలు పూరి ఆలయం నుంచి గుడించా ఆలయం వరకూ వెళ్లేవి. ఆ దారిలో భారీ బలగుండి వాగు వచ్చేది. అక్కడ రథాలను నిలిపివేసి పడవల్లో విగ్రహాలను పెట్టి ఒడ్డు దాటేవారు. అవతల మూడు రథాలు వేచి ఉండేవి. వాటిలో విగ్రహాలను పెట్టి రథయాత్రను పూర్తి చేసేవారు. పూరి రాజ్య బాధ్యతలు రాజా కేసరి నరసింహ చేపట్టాక ఈ బలగుండి వాగుపై రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి మూడు రథాలనే వినియోగిస్తున్నారు.