
భోళాశంకరుడి ఆలయాలు దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. పైగా ఏదో ఒక రహస్యాన్ని దాచుకున్నవే. ఇలాంటి మిస్టీరియస్ దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి కేదారేశ్వర స్వామివారి ఆలయం ఒకటి. కేదారేశ్వర్ గుహ ఆలయం అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగడ్ కోటలోని ఒక గుహలో ఉంటుంది. ఈ ఆలయం ఎల్లప్పుడూ నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ ఆలయం దాని నిర్మాణం కారణంగా ప్రఖ్యాతి గాంచింది. చూడగానే ఆకట్టుకునేలా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది.
ఆసక్తికరంగా ఈ మందిరంపై ఒక పెద్ద బండరాయి.. దాని కింద 4 స్తంభాలు పైన శివయ్య కోసం గుడి నిర్మించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనేది ఎవరికీ తెలియదు. ఈ ఆలయంలోని 4 స్తంభాలు.. సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాలకి ప్రతీకలుగా భావిస్తారు. ఒక్కో స్తంభం విరిగిపోతే.. ఒక్కో యుగం అంతమవుతుందట. ఉండటానికి నాలుగు స్తంభాలున్నా.. ఆలయం మొత్తం ఒకే ఒక్క స్తంభంపైనే ఆధారపడి ఉంది. ఈ స్తంభానికి ఏమైనా జరిగిందో.. కలియుగం అంతమవుతుందని చెబుతారు. మరో విశేషం ఏంటంటే.. ఈ గుడి నాలుగు గోడల నుంచి నీరు ప్రతి రోజూ వస్తూనే ఉంటుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వర్షాకాలంలో మాత్రం ఈ ఆలయంలో ఒక్క చుక్క కూడా నీరుండదు. వేసవి, శీతాకాలాలల్లో మాత్రం 5 అడుగుల మేర నీరుంటుంది.
