హిందువులంతా ఏ శుభకార్యం మొదలు పెట్టినా.. పూజా కార్యక్రమం నిర్వహించినా తొలి పూజ మనం వినాయకుడికి చేస్తాం. అలాంటి వినాయకుడి ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రతి ఊరిలోనూ తప్పనిసరిగా వినాయకుడి ఆలయం ఉంటుంది. వాటిలో కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకం. అలా విశాఖ నగరానికే తలమానికమైన ఓ వినాయకుడి ఆలయం గురించి తెలుసుకుందాం. సాగర తీరం అద్భుతాలకే కాదు.. ఆలయాలకు కూడా ప్రత్యేకమేనని చెప్పాలి. అలాంటి ఆలయాల్లో సంపత్ వినాయకుని ఆలయం విశాఖ నగరానికి తలమానికంగా ఉంటుంది.
ఈ ఆలయం గురించి తెలిసిన వారెవరూ విశాఖ వెళితే దర్శించుకోకుండా తిరిగి రారు. ఈ ఆలయ విశిష్టతను వెల్లడించే ఒక విషయం ఉంది. 1971వ సంవత్సరంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధ సమయంలో, తూర్పు నావెల్ కమాండ్‌కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్‌ను కాపాడాలని మొక్కుకుని కొబ్బరికాయ కొట్టారట. ఆ తరువాత కొద్దిరోజులకే విశాఖపై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్థాన్ సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ సముద్రంలో మునిగి పేలిపోయిందట. ఈ ఘటన 4 డిసెంబర్ 1971న జరిగింది.