సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో నాగ దేవత ఆలయం ఉంది. జంట నగరాల్లోని భక్తులు అత్యధికంగా సందర్శించే ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం శ్రావణ మాసం.. అందునా శ్రావణ శుక్రవారం కావడంతో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ ఆలయంలోని స్తంభాలపై పలువురు దేవతల చిత్రాలు మనకు కనిపిస్తాయి. అలాగే నాగదేవతలకు సంబంధించిన కథలు సైతం గోడలపై మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో శ్రీ సూక్త హోమం, ప్రపంచ శాంతి కోసం యజ్ఞం, మహా మృత్యుంజయ హోమం, సరస్వతీ హోమం, నవ గ్రహ హోమం, మహా సుదర్శన హోమం, మహా దేవి హోమం, పితృ యజ్ఞం, గాయత్రీ హోమం, గ్రహ శాంతి హోమం వంటి వివిధ రకాల హోమాలు నిర్వహిస్తారు.
తిరుమలగిరి నాగదేవత దేవాలయం సుమారు 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి సంవత్సరానికి ఒకసారి నాగదేవతను దర్శనం చేసుకుంటూ ఉంటారు. నాగ దోషం వున్న వారికి, అకాల మృత్యువు రాకుండా ఉండేందుకు.. సంతానం లేని వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చి నాగదేవతకు పాలు పోస్తే పిల్లలు పుడతారు. వివాహం కాని వారికి ఈ ఆలయంలో పూజ చేసుకుంటే తప్పక వివాహం జరుగుతుందని నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల దేవత అని భక్తుల విశ్వాసం.