దేశ మొత్తం ఈ నెల 7వ తేదీన వినాయక చవితిని జరుపుకోనుంది. ఇప్పటికే వీధుల్లో ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వీధికో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంట్లోనూ గణపతిని ప్రతిష్టించుకుని పూజ చేసుకుంటారు. చక్కగా వినాయకుడి కోసం పీటనో.. టేబుల్‌నో ఏర్పాటు చేసి పాలవెల్లి కట్టి, పండ్లు, పూలతో ఇంటిని అందంగా అలంకరించి పూజ చేస్తారు. అయితే ఇంట్లోకి వినాయకుడిని తీసుకురావడానికి ముందు.. ఎలాంటి వినాయకుడిని తీసుకు రావాలనే విషయమై క్లారిటీ ఉంటే పూజ ఫలితం మరింత బాగుంటుంది. అవేంటో తెలుసుకుందాం.
ఇంట్లోకి తీసుకొచ్చే గణేష్ విగ్రహం తొండం ఎడమ వైపుకు వంగి ఉంటే చాలా మంచిదట. అలాగే వినాయకుడు నిలుచున్న భంగిమలోఉన్న విగ్రహాన్ని తీసుకురాకపోవడమే ఉత్తమమట. ఏదైనా ఆసనంపై కూర్చొన్న విగ్రహం అయితే ఉత్తమం. ఆ ఆసనం ఎలుకకైతే మరీ మంచిదట. ఇక నలుపు రంగులో ఉండే వినాయకుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదట. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహమైతే పర్యావరణానికి కూడా మంచిది. పైగా మట్టిని పంచ భూతాల్లో ఒకటిగా భావిస్తాం కాబట్టి మట్టి వినాయకుడు అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఈ సూచనలు పాటించి వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చారో ఇక మీకు తిరుగుండదట.