
అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వర స్వామివారి గురించి తెలుసుకున్నాం. ఇక్కడి ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పంట పొలాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతిని కలుగజేస్తుంటుంది. అప్పలాయగుంట క్షేత్రంలో తొలుత ఆలయ ప్రధాన ద్వారం.. దానిని దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాలయం ఉంటుంది. ఈ అంతరాయానికి ఎదురుగా శ్రీవారి గర్భగుడి ఉంటుంది. దీనిలో శ్రీనివాసుని దివ్య మంగళ రూపం భక్తులకు కనువిందు చేస్తుంది.
ఈ క్షేత్రంలో శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడి ఆంజనేయ స్వామి అత్యంత మహిమాన్వితుడని అంతా నమ్ముతారు. ఈ ఆలయంలో స్వామివారిని సేవిస్తే ఎలాంటి దీర్ఘకాలిక రోగమైనా ఇట్టే పోతుందని చెబుతారు. ఈ ఆలయంలో స్వామిని కొలిచి వ్యాధులు తగ్గిన వారు తిరిగి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఇక్కడి శ్రీనివాసుడికి సుప్రభాతం సహా ఇతర సేవలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి. వీకెండ్స్‌లో భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
