వీసా గాడ్‌గా ప్రఖ్యాతి గాంచిన చిలుకూరి బాలాజీ ఆలయం గురించి అందరికీ తెలిసిందే. మనసులోని కోరిక శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చెప్పుకుని 11 ప్రదక్షిణలు చేస్తే చాలు.. మన కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఇలాంటి ఆలయమే మరొకటి కూడా ఉంది. అయితే ఆ ఆలయంలో కొలువైంది.. విఘ్నేశ్వరుడు. అసలు ఆ ఆలయ విశిష్టతేంటి? ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ ఆలయం మరెక్కడో లేదు. తెలంగాణలోనే ఉంది. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉంది. ఇక్కడి ఆలయంలో గణేశుడు కొలువయ్యాడు.
ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభువుగా మాత్రమే కాదు.. దక్షిణాభిముఖంగా వెలిశాడు. అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. సంకటహర చతుర్థి రోజున అయితే ఈ ఆలయానికి తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. ఎక్కడైనా గణేశుడు మనకు సింధూరంతో కనిపించడం చాలా అరుదు. కానీ ఇక్కడ మాత్రం గర్భాలయంలో స్వామివారి విగ్రహం సింధూరంతో ఉండటం విశేషం. ఇక స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారికి మన మనసులోని కోరిక చెప్పుకుని 11 ప్రదక్షిణలు చేస్తే 41 రోజుల్లో కోరిక నెరవేరుతుందని నమ్మకం.