కొన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలకు కానీ.. తీర్థ యాత్రలకు కానీ వెళ్లినప్పుడు పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేస్తుంటారు. బీహార్‌లోని గయ ఈ పిండ ప్రదానాలకు వెరీ స్పెషల్. ముఖ్యంగా ఇక్కడ అకాల మరణం చెందిన వారికి ప్రత్యేకంగా పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసి సత్తులను సమర్పిస్తే చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందట. బీహార్‌లోని గయా నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రేత శిల అనే పర్వతం ఉంది. దీని ఎత్తు దాదాపు 975 అడుగులు.
ఈ పర్వతానికి 400 మెట్లు ఉంటాయి. ఇవి ఎక్కితే ప్రేతశిల ఉంటుంది. ఇక్కడ సత్తులను సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది. ప్రేతశిల పర్వతంపై ఒక రాయిపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉంటాయి. భక్తులు ఈ కొండపై ఉన్న శిలపై ప్రదక్షిణ చేసి సత్తు ఊదుతారు. ఇలా సత్తులను ఊదడం వలన పూర్వీకులకు స్వర్గానికి వెళ్లేందుకు మార్గం తెరుచుకుంటుందని నమ్మకం. పురాణాల ప్రకారం సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రాముడు ఈ పర్వతం మీదకు వచ్చాడట. ఆ తర్వాత ప్రేత శిల వద్ద ఉన్న బ్రహ్మకుండ సరోవరంలో స్నానం చేసి ఆ తరువాత తన తండ్రి దశరథుని శ్రాద్ధ కర్మలను నిర్వహించాడని చెబుతారు. బ్రహ్మ బొటన వేలితో గీసిన రెండు గీతలు ఇప్పటికీ పర్వతంపై కనిపిస్తాయని కూడా చెబుతారు.