
శ్రీకాళహస్తి ఆలయ విశేషాల గురించి చాలా తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా “తేరు వీధి”కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి “బిచ్చాలు” దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని “బాల జ్ఞానాంబి గోపురం” అని, ఉత్తరం గోపురాన్ని “శివయ్య గోపురం” అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని “తిరుమంజన గోపురం” అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున “సూర్య పుష్కరిణి”, ఎడమవైపున “చంద్ర పుష్కరిణి” ఉన్నాయి.
స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవస్తాయి. ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి – అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు – నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు – మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు.
ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి. ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం.
