ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. నిన్న మౌని అమావాస్య కావడంతో అమృత స్నానం (షాహి స్నాన్) కోసం భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రికార్డ్ స్థాయిలో భక్తులు కుంభమేళాలో స్నానమాచరించేందుకు వచ్చారు. బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకు త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 8 కోట్లు దాటవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
మౌని అమావాస్య కావడంతో తెల్లవారుజామున 2:30 గంటల నుంచే పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలకు అధికారులు భక్తులను అనుమతించారు. ఒక్కసారిగా బారికేడ్లు తొలగించడంతో మహా కుంభమేళాలో భక్తులు పెద్ద ఎత్తున స్నానాలకు తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అపశ్రుతి చోటు చేసుకుంది. విపరీతమైన రద్దీ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.