టీటీడీకి భక్తులు ఎవరైనా సందేహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఇలా చేయండి..

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సందేహాల నివృత్తికి.. సూచనలు చేయాలనుకునే వారి కోసం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని చేపట్టింది. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం ఆగష్టు 2వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కూ తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

శ్రీవాణి కౌంటర్‌ను టీటీడీ అధికారులు తాత్కాలింగా మార్చనున్నారు. గోకులం అతిథి గృహం సమీపంలోకి ఈ కౌంటర్‌ను మార్చడం జరిగింది. శాశ్వత ప్రాతిపదికన అన్నమయ్య అతిథి గృహం సమీపంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 67,916 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా.. వారిలో 23,010 మంది భక్తులు శ్రీ మలయప్ప స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.93 కోట్లు వచ్చింది.

Share this post with your friends