హిందువులకు ఆధ్యాత్మికంగా చివరి మజిలీ కాశీ పట్టణం అని చెబుతారు. మరణించే లోపు ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలనో లేదంటే.. మరీ ముఖ్యంగా కాశీలో మరణించాలని అంతా ఒక్కసారైనా కాశీ వెళ్లాలని హిందువులంతా కోరుకుంటారు. ఇలా కాశీ గురించి ఎన్నో ఆసక్తి గొలిపే అంశాలు ఉన్నాయి. అయితే కాశీకి వెళ్లినవారు అక్కడ ఏదో ఒకటి వదిలేయాలని చెబుతుంటారు. అసలు ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం. కాశీలో మరణిస్తే ముక్తి ఖాయమని అయితే శ్రీనాథ మహాకవి తను రచించిన కాశీఖండంలో తెలిపారు.
ఇక మనకు ఇష్టమైనది విడిచి పెట్టాలని అంటారు. ముఖ్యంగా కాయో పండో వదిలేయాలని చెబుతారు. అసలు శాస్త్రంలో దీని గురించి ఎక్కడా చెప్పలేదని అంటారు. కాయ లేదంటే పండు వదిలేయాలనే నియమమే లేదట. శాస్త్రం చెప్పింది ఒకటైతే జనాలు ఆచరించేది మరొకటి. అసలు శాస్త్రం ఏం చెబుతోందంటే.. కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి ‘కాయో పేక్షో’ గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలని చెబుతోంది. ‘కాయో పేక్ష’ అంటే కాయం అంటే శరీరం. పేక్ష అంటే మమకారం. శరీరంపై మమకారం వదిలిపెట్టాలని అర్థం. అది కాస్తా కాయో.. పండో అని మారిపోయింది.