గుస్సాడీలు చేపట్టే దీక్ష ఎంత కఠినంగా ఉంటుందంటే..

ఆదివాసీలు చేపట్టే దండారి పండుగ గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. పదిహేను రోజుల పాటు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ నేపథ్యంలో ఆదివాసీల కట్టు బొట్టు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో చేపట్టే దీక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఈ పండుగ సమయంలో గుస్పాడీలదే కీలక పాత్ర. నెత్తిపై నెమలి పింఛం.. ఒంటినిండా బూడిదతో.. ముఖానికి నల్లని రంగుతో గుస్సాడీలు కనిపిస్తారు. వీరిని ఆ సమయంలో ఆదివాసీ దేవుని ప్రతిరూపంగా భావిస్తారు.

ఇక ఈ పండుగ సమయంలో గుస్సాడీలు పది రోజుల పాటు కఠిన దీక్ష చేపడతారు. ఆశ్వీయుజ పౌర్ణమి మరుసటి రోజు అంటే దీపావళికి ముందు భోగి పండుగ నాడు మాలధారణ చేస్తారు. ఈ దీక్ష పూర్తయ్యే వరకూ స్నానముండదు సరికదా.. ఒంటిపై చుక్కనీరు కూడా పడనివ్వరు. చెప్పులు ధరించరు. అర్ధనగ్నంగా ఉంటారు. ఎంత చలిగా ఉన్నా ఒంటిపై వస్త్రాన్ని కప్పుకోరు. కూర్చున్నా.. నిలుచున్నా.. పడుకున్నా అంతా నేలపైనే నిద్రిస్తారు. ఇక గుస్సాడీల్లో పోరీలు ఉంటారు. ఆ పోరీలు మరెవరో కాదు.. ఆడ వేషధారణలో ఉండే యువకులు. ఈ పోరీలు ఎక్కడికి వెళ్లినా మంగళహారతులతో అష్ట, ఐశ్వర్యాలు కలగాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలనీ దీవిస్తారు.

Share this post with your friends