పుష్య మాసం ఆధ్యాత్మికంగానూ.. ఆరోగ్యపరంగానూ చాలా ముఖ్యమైనదని చెబుతారు. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్య మాసమని పేరు వచ్చింది. ఈ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలేంటో తెలుసుకుందాం. ఈ మాసంలో విష్ణుమూర్తిని, శివుడిని పూజిస్తే చాలా మంచి జరుగుుతంది. సౌందర్యం కోసం శ్రీహరిని పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకూ ఆయనకు ఇష్టమైన తులసీ దళాలతో పూజించాలట.
ఐశ్వర్యం కావాలంటే.. పుష్య మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడికి మారేడు దళాలతో అర్చన నిర్వహించాలట.
తమిళులకు పుష్యమాసం చాలా ఇష్టమైన మాసమట. ఈ మాసంలో తమిళులు పుష్యమాసం శుద్ధ షష్టిని నిర్వహించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. పుష్య శుక్ల అష్టమి కూడా పవిత్రమైనదే. ఈ రోజున పితృదేవతలను ఆరాధిస్తారు.
పుష్య శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. అతి పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి ఈ మాసంలోనే వస్తుంది. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికి ఆఖరి రోజు భోగి పండుగ వస్తుంది. చీకటితోనే లేచి భోగి మంటలు వేస్తారు. ముఖ్యంగా భోగినాడు వైష్ణవ దేవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు.