సోమ ప్రదోష వ్రతం రోజున శివాలయంలో మనం పూజలు ఎలా చేయాలో తెలుసుకుందాం. సూర్యాస్తమయ సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసి అర్చన జరిపించుకుని అనంతరం కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి. ముఖ్యంగా శివుడిని పూజించేటప్పుడు తప్పని సరిగా బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. అనంతరం ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. అనంతరం శివుడికి హారతి ఇవ్వాలి.
ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న కాబట్టి సోమ ప్రదోష వ్రతం రోజు శివాలయంలో అన్నదానం చేస్తే మంచిది. అలాగే తమ స్తోమతకు తగినట్టుగా వస్త్ర దానం, ఛత్ర దానం లేదంటే ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం ఇస్తే మంచిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు రాగ ద్వేషాలకు అతీతంగా.. మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే ఈ రోజున నల్ల దుస్తులు మాత్రం ధరించకూడదు. చిత్త శుద్ధితో శివపార్వతులను ఆరాధిస్తే ఫలితం అద్భుతంగా మనం ఊహించిన విధంగా ఉంటుంది.