వివాహ పంచమి నాడు అరటి చెట్టును ఎలా పూజించాలంటే..

వివాహ పంచమి ఈ నెల 6వ తేదీన రానుంది. ఆ రోజున సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో.. అలాగే సీతా దేవి జన్మస్థలం నేపాల్‌లోని అలాగే జనక్‌పూర్‌లలో రాముని ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజిస్తారని తెలుసుకున్నాం కదా.. అరటి చెట్టును ఎందుకు పూజించాలో కూడా తెలుసుకున్నాం. ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ పంచమి రోజున బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేవాలి. శుచిగా స్నానం చేసి పసుపు బట్టలు ధరించాలి. ఆ తరువాత అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. పసుపు, చందనంతో పాటు పుష్పాలను అరటి చెట్టుకు సమర్పించాలి.

ఆ తరువాత అరటి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించి.. ధూపం వేయాలి. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని చెబుతారు కాబట్టి ఆ రోజున ఆయనకు సంబంధించిన మంత్రాలను జపించాలి. అరటి చెట్టును పూజిస్తూ లక్ష్మీనారాయణుడిని ధ్యానించండి. దీని తరువాత అరటి చెట్టునుల పంచామృతం, అరటిపండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఆపై పువ్వులతో పూజించాలి. పూజ పూర్తైన తర్వాత అరటి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణలు చేసి.. అరటి చెట్టు ముందు పెళ్లి కాని వారు పెళ్లి కుదరాలని.. దంపతుల మధ్య విబేధాలు ఉంటే సమసిపోవాలని కోరుకోవాలి. అలా చేస్తే అన్ని ఇబ్బందులూ తొలగిపోయి పెళ్లి కాని వారికి పెళ్లవుతుందట. అలాగే దంపతుల మధ్య ఏమైనా విభేదాలుంటే తొలగిపోతాయట.

Share this post with your friends