
వాస్తవానికి శనీశ్వరుడిని తీసుకొచ్చి ఇంట్లో అయితే ఎవరూ పెట్టుకోరు. దాదాపుగా అంతా ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. ఒకవేళ ఇంట్లో శనీశ్వరుడి పూజ చేయాలనుకుంటే ఆ రోజున ఎలా చేయాలో తెలుసుకుందాం. శని జయంతి ఈ నెల 27వ తేదీన రానుంది. ఆ రోజున ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తరువాత శని దేవుడి చిత్రపటాన్ని ఒక పీటపై నల్లని వస్త్రాన్ని పరిచి దానిపై ప్రతిష్టించండి. ఆ తరువాత ఆవ నూనెతో దీపం వెలిగించాల్సి ఉంటుంది. శనీశ్వరుడి చిత్రపటానికి కుంకుమ, పుసుపుతో అలంకరించాలి.
ఆపై నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత శనీశ్వరుడి పూజను ఆరంభించాలి. శని చాలీసా పారాయణం చేయగలిగిన వారు అది కూడా చేస్తే చాలా మంచిది. అనంతరం శని దేవుడికి హారతి ఇచ్చి పూజను ముగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఈ రోజున దానాలు చేస్తే తప్పక శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. నల్ల నువ్వులు, నూనె, నల్లని వస్త్రాలు, ఇనుప వస్తువులు, బూట్లు దానం, మినపప్పు, దుప్పట్లు దానం చేయడంతో పాటు పేదవారికి అన్న వితరణ చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది.
