
మంగళవారం కాలాష్టమి అని తెలుసుకున్నాం కదా. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం ఉండేవారు ఉదయం నుంచే ఉండాల్సి ఉంటుంది. ఒక పీటను శుభ్రం చేసి దానిపై కాలభైరవుని విగ్రహం లేదంటే చిత్రపటాన్ని ప్రతిష్టించి పువ్వుల దండ వేసి.. అనంతరం పూజకు నీలం లేదా నలుపు రంగు పువ్వులు, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం ఆవ నూనెతో లేదంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇక నైవేద్యంగా జిలేబి కానీ మినుములతో చేసిన ఏదైనా స్వీట్‌ను సమర్పించాలి.
పూజ పూర్తైన మీదట కాలాష్టమి కథను చదవడమో.. వినడమో చేసిన అనంతరం కాలభైరవునికి హారతి ఇవ్వాలి. ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ఈ రోజున పూజ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏకాగ్రతతో మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఉచ్ఛారణ దోషాలున్నా.. లేదంటే మంత్రాలను పటించడంలో సందేహాలున్నా తెలిసిన వారిని అడిగి తెలుసుకుని చక్కగా పూజ చేసుకోండి. పూజ సమయంలో తూర్పు లేదంటే ఉత్తరం ముఖంగా కూర్చోవాల్సి ఉంటుంది. కాలభైరవ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపించేవారు రుద్రాక్షను ఉపయోగించండి.
