దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి? నమస్కారాలెన్ని రకాలు?

దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక ఉండి చేయాలి. అసలు నమస్కారాలు ఎన్ని రకాలంటే..

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే “ఓం నమః శివాయ” అని అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి…

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.

Share this post with your friends