కాత్యాయని వ్రతం చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. అసలు కాత్యాయని వ్రతం ఎప్పుడు ఆచరించాలో కూడా తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజు కాత్యాయని వ్రతాన్ని ఆరంభించి వరుసగా ఏడు వారాల పాటు నిర్వహించాలి. కాత్యాయని వ్రతం పూజా విధానం గురించి తెలుసుకున్నాం. కాత్యాయని వ్రతం ఆచరించే వారు సూర్యోదయంతో నిద్ర లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం రోజంతా ఉపవాసం ఉంటామని నిర్ణయించుకోవాలి. ముందుగా పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోయాలి. బియ్యం పైన రాగి చెంబు గాని, ఇత్తడి చెంబు గాని ఉంచి, దానిపై టెంకాయను ఉంచి కలశం సిద్ధం చేసుకోవాలి.
కలశాన్ని ఎర్రని వస్త్రంతో అలంకరించాలి. ఆ తరువాత పీటపై శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచాలి. శివపార్వతుల చిత్రపటాన్ని గంధం, కుంకుమ, ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించి అనంతరం దీపారాధన చేసుకోవాలి. పూజకు ముందుగా పసుపు గణపతిని చేసి పూజను ప్రారంభించాలి. ఎర్రని అక్షింతలతో పార్వతి పరమేశ్వరులకు షోడశోపచార పూజలు, అష్టోత్తర శతనామ పూజలు చేయాలి. పూజ అక్షితలను మన తలపై వేసుకున్న మీదట అన్ని రకాల పిండివంటలతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించాలి. మంగళ హారతి ఇచ్చి నమస్కరించుకుని చివరిగా వ్రత కథను వినడమో చదవడమో చేయాలి. ఆ తరువాత అక్షింతలను తలపై వేసుకుంటే పూజ పూర్తవుతుంది. ఏడు వారాల పాటు ఇలాగే పూజ చేసుకుని 8వ వారం ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది.