తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో మురుగన్ ఆలయంగురించి తెలుసుకున్నాం కదా. పట్టరైపెరుమంతూర్‌లో కులుత్తుంగ చోళరాజుల పాలనలో 13వ శతాబ్దంలో దీనిని చోళులు నిర్మించారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నాడు. చెన్నై-తిరుపతి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆలయ ప్రాంతంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే స్థానికులు దీనికి ఏమాత్రం అంగీకరించలేదు. ఆలయంలో సొరంగ మార్గంతో పాటు గుప్త నిధులు ఉన్నాయని.. ప్రాచీన ఆలయాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ విషయమై పెద్ద ఎత్తున నిరసనలు సైతం చేపట్టగా అధికారులు దిగి వచ్చారు.
గ్రామస్థుల అభ్యర్ధన మేరకు తిరువల్లూరు జిల్లా పురావస్తు శాఖ ఇన్స్‌పెక్టర్ లోకనాథన్ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి(మురుగన్) రాతి విగ్రహం ఉన్న ఆలయాన్ని పూర్తిగా పరిశీలించిన మీదట.. ఆలయం లోపల ఒక సొరంగ మార్గం ఉందని గుర్తించారు. స్థల పురాణం ప్రకారం అయితే ఈ సొరంగ మార్గం తిరువేలంగాడులోని ప్రాచీన శివాలయం వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే అధికారులు ఈ విషయమై వివరాలు సేకరిస్తున్నారు. గతంలో పట్టరైపెరుమంథూర్ ప్రాంతంలో ఇప్పటికే మూడు దశల వారీగా పురావస్తు అధికారులు తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో ఈ ఆలయంలో 1000 కి పైగా పురాతన శకలాలు, శిల్ప సంపద బయటపడ్డాయి.