సుబ్రహ్మణ్యస్వామి.. గురుగుహుడు ఎలా అయ్యాడంటే..

అవ్యక్తం, వ్యక్తం, మహత్ , అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారమని చెప్పుకున్నాం కదా. కుమారస్వామి అహంకారమని.. ఈ అహంకారతత్వం నుంచే సకల జగత్తు సృష్టించబడిందని చెప్పుకున్నాం. ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనే భావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్య లక్షణమే అహంకారంగా పేర్కొనడం జరుగుతుంది.

ఈ సృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి ‘నేను చేస్తున్నాను’ అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే. ఈ ‘అహం’తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామి. శివతేజస్సు నుండి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే ‘దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః’ అని అర్ధంగా ఇవ్వబడినది.

Share this post with your friends