మహారాష్ట్రలో ఎన్ని శక్తి పీఠాలున్నాయి? వాటిలో సప్తశృంగి ప్రాధాన్యత ఏంటి?

అమ్మవారి ఆలయాలు ఎక్కడ ఉన్నా కూడా చాలా శక్తివంతమైనవే. ఏడు శిఖరాల మధ్య ప్రకృతి సౌందర్యంతో అలరారే కొండపై వెలిసిన ఓ అమ్మవారు అత్యంత శక్తివంతురాలిగా పేర్కొంటారు. ఇంతకీ ఎవరా అమ్మవారు? ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఒక చిన్న గ్రామమైన కల్వాన్ తాలూకాలోని నండూరిలో సప్త శృంగాలపై అమ్మవారు స్వయంభువుగా వెలిసింది. ఈ ఆలయాన్ని సప్తశృంగి ఆలయంగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలో నివసించే మరాఠాలు చాలా కాలంగా తమ కులదైవంగా భావించి సప్తశృంగి దేవతను పూజిస్తున్నారు.

కుగ్రామంలో ఉన్నా కూడా ఈ సప్తశృంగి ఆలయం సతీదేవి 52 శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతంలో సతీదేవి కుడిచేయి పడిపోయిందని చెబుతారు. మహారాష్ట్రలో మూడున్నర శక్తి పీఠాలున్నాయని దేవీ భాగవతం చెబుతోంది. వాటిలో సప్తశృంగిని సగం శక్తిపీఠం అంటారు. మహారాష్ట్రలోని శక్తి పీఠాలేంటంటే.. కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం, తుల్జాపుర్‌లోని తుల్జా భవానీ ఆలయం, మహూర్​లోని రేణుకా ఆలయం, వాణిలోని సప్తశృంగి ఆలయం. మహారాష్ట్రలోని ఈ నాలుగు ఆలయాలు పవిత్ర ‘ఓం’ కారం నాలుగు స్వరూపాలైన ‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కార, ‘మ్’ కారాలను సూచిస్తాయట.

Share this post with your friends