సోదర, సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా మనం రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటాం. రాఖీ పండుగను ఈ నెల 19న జరుపుకోనున్నాం. రాఖీ పండుగ రోజున సోదరుడి చేతికి సోదరి రాఖీ కట్టడం ఆనవాయితీ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రాఖీని ఎప్పుడు తీయాలనేది చాలా మందికి తెలియదు. కొందరైతే వెంటనే తీసి పడేస్తారు. మరికొందరు ఒకట్రెండు రోజుల్లో తీసేస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రాఖీని తీయకూడదట. మరి ఎప్పుడు తీయాలి? తీసిన తర్వాత రాఖీని ఏం చేయాలో చూద్దాం. రాఖీని కట్టే సమయంలో సోదరుడు తూర్పు ముఖంగానూ.. సోదరి పడమర ముఖంగానూ ఉండాలి.
రాఖీ కట్టడానికి ముందు సోదరుడికి కుంకుమ, చందనంతో తిలకం దిద్దాలట. ఆ తరువాత అక్షితలు తలపై వేసి ఆ తరువాత రాఖీ కట్టాలి. ఇక రాఖీని కట్టిన తరువాత 21 రోజుల పాటు ఉంచుకోవాలి. అన్ని రోజులు ఉంచుకోలేకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకైనా ఉంచుకోవాలి. ఇక తీసేసిన తర్వాత రాఖీని ఎర్రటి గుడ్డలో చుట్టి పవిత్ర స్థలంలో లేదంటే సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచాలి. దీనిని మళ్లీ వచ్చే రాఖీ పండుగ వరకూ ఉంచి ఆ తరువాత దానిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలట. ఒకవేళ రాఖీ తీసే సమయంలో చిరిగిపోతే దానిని ఒక రూపాయి నాణెంతో పాటు ఏదైనా చెట్టు మూలంలో పాతి పెట్టడం కానీ నీటిలో వదిలేయడం కానీ చేయాలి.