అష్టాదశ శక్తి పీఠాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయంటే..

అష్టాదశ శక్తి పీఠాల గురించి మనకు చాలా వరకూ తెలుసు. అయితే దక్షయజ్ఞంలో అవమానపాలైన సతీదేవి అగ్నిలో దూకింది. అయితే ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని పరమశివుడు భారత ఖండం అంతా తిరుగుతున్న సమయంలో అమ్మవారి శరీర భాగాలు ఒక్కోటి ఒక్కోచోట పడ్డాయి. వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలుగా కొలుస్తున్నాం. వాస్తవానికి ఇవి మొత్తం 108. వాటిలో అతి ముఖ్యమైన 18 కాబట్టి మనం అష్టాదశ శక్తి పీఠాలని చెబుతాం. వాటిలో కొన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉండటం విశేషం. కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబిక ఆలయం కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.

అప్పట్లో ఆధ్యాత్మిక గురువు ఆదిశంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని సందర్శించారట. ఆ సమయంలో ఆయన ఇక్కడే శివానంద లహరిని రచించారని చెబుతారు. మరొకటి ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉంది. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పురుహూతిక దేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు. అలాగే కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో మాణిక్యాంబ దేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి కావడం విశేషం. ఇక తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక శక్తి పీఠం ఉంది. అదే ఆలంపూర్ జోగులాంబ ఆలయం. దీనిని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేశారు.

Share this post with your friends