మిగిలిన అన్ని రాష్ట్రాలకు భిన్నంగా దసరా శరన్నవరాత్రులను తెలంగాణలో జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ’ తెలంగాణ రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను రకరకాల పూలతో అందంగా పేర్చి తొమ్మిది రోజుల పాటు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు.
బతుకమ్మ అనేది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. బతుకమ్మ చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. మగవారంతా చేలు, పొలాల్లోకి వెళ్లి తంగేడి, గునుగు ఇతర పూలను భారీగా తీసుకుని వస్తారు. మహిళలు వాటిని బతుకమ్మగా అందంగా పేర్చుతారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు. బతుకమ్మ పేర్చడం పూర్తైన తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. అనంతరం బతకమ్మల చుట్టూ తిరుగుతూ గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాటలు పాడుతారు. ఇలా చాలాసేపు ఆడాక బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.