
వినాయకచవితి వచ్చిందంటే చాలు.. తొమ్మిది రోజుల పాటు ఎక్కడ చూసినా గణేషుని పాటలు.. గణపతి బప్పా మోరియా నినాదాలు వినిపిస్తాయి. గణపతి బప్పా మోరియా అనేది తెలుగుకు సంబంధించిన స్లోగన్ కాకున్నా కూడా పెద్ద ఎత్తున ఇస్తూనే ఉంటారు. దీనికి కారణమేంటి? అసలు ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దీని వెనుక పెద్ద కథే ఉందట. అదేంటో తెలుసుకుందాం. అది 15వ శతాబ్దం. అప్పట్లో మహారాష్ట్రలోని పుణెకు 21 కి.మీ దూరంలో చించ్వాడి అనే గ్రామంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు నివసిస్తుండేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించడం కోసం నిత్యం చించ్ వాడి నుంచి నడుచుకుంటూ మోరేగావ్ అనే గ్రామానికి వెళ్లేవాడు. ఒకరోజు మోరియా నిద్రిస్తుండగా కలలో గణేశుడు కనిపించి తాను సమీపంలో నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట.
నిద్రలేచిన వెంటనే తన స్వప్నం ఎంతవరకూ నిజమో తెలుసుకునేందుకు సదరు నది వద్దకు వెళ్లాడు. నదిలో నిజంగానే వినాయకుడి విగ్రహం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా ఎంత గొప్పవాడు కాకుంటే సాక్షాత్తు గణపతియే కలలో కనిపిస్తాడని భావించి మోరియా దర్శనం కోసం క్యూ కట్టారట. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ పాదాలకు మొక్కి మోరియా అనటం మొదలుపెట్టారు. ఇక తనకు నదిలో దొరికిన వినాయకుడికి మోరియా ఆలయాన్ని నిర్మించాడట. ఆ తరువాత అక్కడ గణపతి ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ ఉత్సవాల్లోనే గణపతి బొప్పా మోరియా.. అనే స్లోగన్ ఇవ్వడం ఆరంభమైంది. అది కాస్తా దేశమంతా పాకింది. ఆ నదిలో మహా గణపతిని ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడట గోసావి. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది. ముఖ్యంగా గణేశ్ నిమజ్జన సమయంలో గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా.. అని నినాదాలు చేస్తారు.
