తమిళులు జరుపుకునే నూతన సంవత్సర వేడుక పుతుండు గురించి తెలుసుకున్నాం కదా. పుతుండును తమిళ ప్రజలు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. పుతండు రోజు ప్రజలు బ్రహ్మ ముహూర్తానే నిద్ర లేచి ముందుగా ‘కన్నీ’ అనే ఆచారాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా పండ్లు, పువ్వులు, బంగారం, వెండి, డబ్బు, తమలపాకులు, అద్దం వంటి శుభ వస్తువులను ముందురోజు రాత్రి ఒక పెద్ద పళ్లెంలో సర్దుతారు. ఇవాళ నిద్ర లేవగానే ముందుగా ఈ పవిత్రమైన వస్తువులను చూస్తారు. వీటిని చూస్తే సంవత్సరమంతా అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.
తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా తమిళనాడు అంతటా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంధువులంతా ఒకచోట చేరి సందడిగా గడుపుతారు. సంప్రదాయ వంటకాలన్నీ తయారు చేసుకుని విందు భోజనం ఆరగిస్తారు. ఈ రోజున సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో పాటు వివిధ ప్రాంతాల్లో సంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. తమిళులకు ఇది ముఖ్యమైన పండుగ మాత్రమే కాకుండా ఒక కొత్త ఆరంభానికి శుభ సూచిక. కాబట్టి తమిళులంతా ఆనందాన్ని ఈ పండుగను జరుపుకుంటారు.