వసుదేవుడు.. గాడిద కాళ్లు పట్టుకున్నాడనేది ఎలా వచ్చిందంటే..

వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు.. మనమెంత అంటూ నిత్యం వింటూనే ఉంటాం. అసలు వసుదేవుడు గాడిద కాళ్లు ఎందుకు పట్టుకున్నాడనేది మాత్రం పట్టించుకోం. వసుదేవుడు గాడిద కాళ్లను పట్టుకున్నది ఎన్నడూ లేదట. ఏదో మాట ఎటో ఎటో తిరిగి చివరకు వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్నట్టుగా మారింది. అసలేం జరిగిందంటే.. వసుదేవుడు శ్రీ కృష్ణుడికి తండ్రే అయినప్పటికీ అంతకముందు విష్ణుమూర్తి చతుర్భుజరూపంలో ఉండగా చూస్తూ తన జన్మ ధన్యమైందని భావించి వెంటనే ఆ శ్రీహరి పాదాలని పట్టుకున్నాడట.

ఆ ఆనందంతో వసుదేవుడు మాట్లాడుతూ “శ్రీ హరీ! ఈ కాళ్ళు పట్టుకున్నవాణ్ణి నీ తండ్రి వసుదేవుడు అనుకుంటావేమో! కాదు. పాదాలను వెనక్కి లాక్కోకు, నన్ను ఓ భక్తునిగా, నువ్వు మా దంపతులకి మోక్షాన్ని ఇస్తున్నవానిగా భావించు!” అనే అర్ధం వచ్చేలా ఇలా అన్నాడు. వసుదేవుడు కాడు.. ఇదే కాళ్లు పట్టుకున్నవాడు అని అన్నాడు. అంటే.. నీ పాదాలను పట్టుకున్న నేను నీ తండ్రిని కాను.. నువ్వు నాకు మోక్షాన్ని ఇచ్చావని గ్రహించి ఇదిగో నీ కాళ్లు పట్టుకున్న భక్తుడిని అని తెలిపాడు. ఇక జనాలు ‘వసుదేవుడు కాడు ఇదె’ అని మాత్రమే పట్టుకున్నారు. దీనిని మొత్తాన్ని కలిపి గసడవాదేశ సంధి తీసి మరీ వసుదేవుడు గాడిదె కాళ్లు పట్టుకున్నాడని తెలిపారు.

Share this post with your friends