ఇంద్రాది దేవతలు తమ దురవస్థ నుంచి ఎలా బయటపడ్డారంటే..

ఇంద్రాది దేవతలంతా కుంటివారైపోయి ఆకలితో అలమటిస్తూ పది రోజుల పాటు భూలోకంలోనే ఉండిపోయారు. స్వర్గంలో మిగిలిన దేవతలంతా ఇంద్రాది దేవతలను వెదుక్కుంటూ భూలోకానికి వచ్చారు. దేవతల దురవస్థను చూసి ఆగ్రహంతో పారిజాత వృక్షాన్ని పెకలించబోయారు. కానీ అది అణువంతైనా కదల్లేదు. ఆ సమయంలో ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు.. ఇదంతా చూసి విష్ణు లోకానికి వెళ్లాడు. అక్కడ విష్ణుమూర్తిని పరిపరివిధాలుగా స్తుతించాడు. సకలం తెలిసిన నారాయణుడు ఏమి తెలియనట్లుగానే నారదుని రాకకు కారణం అడిగాడు. అప్పుడు నారదుడు ఇంద్రాది దేవతల విషయంలో జరిగిందంతా విష్ణుమూర్తికి వివరించాడు. దీంతో ఇంద్రుడు లేక స్వర్గం వెలవెలబోతోందని.. కరుణతో వారిని అనుగ్రహించి రక్షించాలని నారదుడు కోరాడు.

నారదుని మాటలు విన్న శ్రీహరి.. ‘‘నారదా! క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన అమృతం నుంచి రెండు చుక్కలు పడిన ప్రాంతంలో పారిజాత వృక్షం, తులసి వృక్షం పుట్టాయని వాటిని సత్వజిత్తు అనే శూద్రుడు నీరు పోసి సంరక్షించాడు. ఇంద్రుడు మోసపూరితంగా పారిజాత పూలను తెప్పించుకునేవాడు. ప్రతిరోజూ పూలు మాయం కావడంతో సత్వజిత్తు నా పూజలో వాడిన పత్రపుష్పాది నిర్మాల్యాన్ని ఆ చెట్టు కింద చల్లాడు. అది తొక్కిన ఇంద్రాది దేవతలకు అలాంటి దుస్థితి కలిగింది. ఆ తరువాత సత్వజిత్తు దేవతలకు కలిగిన దుస్థితికి చింతించి చెట్టు కింద ఉన్న నిర్మాల్యాన్ని తుడిచి తన భార్యతో కలిసి ఉపవాసం చేశాడు. నేడు పరమ పవితమైన ఏకాదశి తిధి. ఈ రోజు సత్వజిత్తు ఉపవసించి నన్ను పూజించి, నా సన్నిధిలో నారాయణ మంత్రం జపిస్తూ జాగరణ చేస్తే నేను అతనికి ప్రసన్నుడనవుతాను. ఆ తరువాత అన్ని శుభాలే జరుగుతాయి”. అని శ్రీహరి నారదునికి దేవతలకు శాపం తొలగిపోయే మార్గం చెప్పాడు. ఆ తరువాత ఏకాదశి నాడు సత్వజిత్తు ఉపవాసంతో దేవతందరికీ విముక్తి లభించింది.

Share this post with your friends