ద్రాక్షారామంలోని ద్రాక్షారామేశ్వరాలయం గురించి తెలుసుకున్నాం కదా. పంచారామాల్లో ఒకటైన ఈ క్షేత్రం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. పంచారామంగానే కాదు.. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగానూ.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగానూ ఈ భీమేశ్వర పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయ సమీపంలో సప్త గోదావరి పుష్కరిణి ఉంటుంది. దానిలో స్నానమాచరించి మాణిక్యాంబ సమేతుడైన భీమేశ్వరస్వామిని దర్శిస్తే మన సకల పాపాలన్నీ పోతాయని నమ్మకం. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణం కూడా చెబుతోంది. స్కంద పురాణం ప్రకారం.. భీమేశ్వరుడులాంటి దైవం, దక్షవాటిక అయిన ద్రాక్షారామం లాంటి ధామం, సప్తగోదావరిని పోలిన తీర్థరాజం.. జగత్తులో లేదట.
అసలు ఈ క్షేత్రానికి ద్రాక్షరామం పేరెలా వచ్చిందో తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ క్షేత్రానికి దక్షారామం అని పేరు వచ్చింది. కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారింది. ఇక్కడికి గోదావరి ఎలా వచ్చిందనే దానికి ఓ ఆసక్తికర కథ ఉంది. ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తోన్న గోదావరి జలాలతో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్తర్షులు భావించారట. కానీ పరవళ్లుతొక్కే గోదావరీ జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించిన తుల్యుడనే మునీశ్వరుడు వారిని అడ్డుకున్నాడట. ఈ వ్యవహారం ఘర్షణకు దారి తీయడంతో వేదవ్యాసుడు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకునేలా చేసి ఆ గొడవను పరిష్కరించాడట. అలాగే సప్త గోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందని వ్యాసుడు తెలిపాడట. అలా గోదావరి ద్రాక్షారామానికి వచ్చి సప్త గోదావరి పుష్కరిణిగా పేరుగాంచింది.