
వాలి, సుగ్రీవుడి మధ్య గొడవకు కారణం తెలుసుకున్నాం కదా. వాలిని తప్పించుకొని సుగ్రీవుడు సముద్రం వరకూ వెళ్లగా అక్కడికి కూడా వాలి రావడంతో కొండవైపు పరుగు తీశాడట. అక్కడికి కూడా వాలి వాయువేగంతో రావడంతో దక్షిణ దిక్కుకు వెళ్లాడట. ఎటు వెళ్లినా అటు వాలి వస్తుండటంతో పర్వతాలకు, నాగదేవతలకు తనను రక్షించాలని వేడుకున్నాడట. అనంతరం అగస్త్యుడు తపస్సు చేసిన దివ్య ప్రాంతాలను చూసినట్టు రాముడికి సుగ్రీవుడు చెప్పాడు. అక్కడికి కూడా వాలి రావడంతో పశ్చిమ దిశలో మేరుసావర్ణి దాకా అటుపై ఉత్తర దిశలోని హిమాలయాలకు.. అక్కడి నుంచి క్రౌంచగిరికి, అట్నుంచి సోమగిరికి ఇలా, ఎన్నో ప్రాంతాలు చుట్టివచ్చినట్టు సుగ్రీవుడు తెలిపాడు.
చివరకు రుష్యమూక పర్వతం వద్ద జీవిస్తున్నట్టు సుగ్రీవుడు చెప్పాడు. అక్కడ మాత్రం వాలి అడుగు కూడా పెట్టలేడట. దానికి మాతంగ మహాముని శాపమే కారణమని సుగ్రీవుడు చెప్పాడు. దాంతో తనను తాను ఇక్కడే స్థిరపడినట్టు సుగ్రీవుడు రామయ్యకు తెలిపాడు. అలా తనకు అన్ని ప్రదేశాలపైనా పట్టు ఉందని, అది ఇలా సీతాన్వేషణలో ఉపయోగపడుతోందని అన్నాడు. తనకు తెలిసిన వివరాలన్నింటినీ వానర ప్రముఖులకు వివరించి తలో దిక్కుకు సైన్యంతో పంపించాడు. అలా హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ సముద్ర తీరం వరకూ వెళ్లి వెతికినా సీత జాడ తెలియలేదు. ఆ తరువాత సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి అశోకవనంలో సీతమ్మ జాడను కనిపెట్టి వచ్చి రామయ్యకు తెలిపాడు.
