భక్తిటీవి కోటి దీపోత్సవం ఇలా ప్రారంభమైంది.. కోటిదీపోత్సవ పుష్కరాలు ప్రత్యేకం

కోటిదీపోత్సవ పుష్కరాలు..

అవి యుగయుగాలుగా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు… సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు…… తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు…… అలాగని మునుపెన్నడూ ఎవరూ చేయని క్రతువు కాదు….. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం!

కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఒక అద్భుతం. పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటిదీపోత్సవం. చైత్రమాసంలో రాములోరి కల్యాణం కోసం ఎదురుచూసినట్లుగా… ఆషాఢమాసంలో బోనాల పండుగకు సిద్ధమైనట్లుగా.. శ్రావణమాసంలో లక్ష్మీపూజలకు… భాద్రపదంలో గణపతి ఉత్సవాలకు… ఆశ్వియుజంలో దేవీ నవరాత్రులకు సంసిద్ధమైనట్లుగా… కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం భక్తిటీవీ కోటిదీపోత్సవం. పన్నెండేళ్లక్రితం వరకు కార్తికమాసంలో అనేకానేక క్షేత్రాల్లో లక్షదీపోత్సవాలు జరిగేవి. కానీ చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై… పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి… తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.

దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే

దీపమనగానే గుర్తుకువచ్చే శ్లోకమిది. ప్రమిదలో వెలిగే పరంజ్యోతే పరబ్రహ్మస్వరూపమని శ్లోకార్థం. భగవంతుడిని సాకార నిరాకార రూపాల్లో దర్శించగలిగే ఏకైక సాధనం దీపం. దీపం అంటే ప్రమిదలో నూనె పోసి.. వత్తి వేసి.. అగ్ని వెలిగించడం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం.

దీపారాధనతో దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి భగవంతునికి అభేదాన్ని చూపేందుకు ప్రతిరోజూ దీపం వెలిగించమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తికమాసంలో దీపం వెలిగించడానికి మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. అటువంటి పుణ్యఫలితం ప్రతి ఒక్కరికీ దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే భక్తిటీవీ కోటిదీపోత్సవం.

ఆద్యంతం ఆధ్యాత్మికం
అణువణువునా భక్తిభావం
దీపాల వెలుగుల్లో పాపసంహారం
భక్తిటీవీ కోటిదీపోత్సవం
ఆస్తిక మహాశయులందరికీ
ఇదే మా ఆహ్వానం.

పుష్కరకాలం క్రితం…

పన్నెండేళ్లక్రితం శృంగేరి దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయయాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. అయితే వారిని అందరూ దర్శించుకునే విధంగా సామూహిక కార్యక్రమంటూ ప్రత్యేకంగా లేకపోయింది. ఈ విషయాన్ని గమనించిన రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీనరేంద్రచౌదరికి ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. గురువందనంతో పాటు ఇంకేదైనా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ భక్తుడి మదిలో.. టీవీల ద్వారా వీక్షించిన ప్రేక్షకుల హృదయాల్లో అనిర్వచనీయ ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపిన అపూర్వ సందర్భమది.

లక్ష కాదు.. కోటి

2013లో మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. మళ్లీ దీపోత్సవం నిర్వహించాలని ఆస్తికులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తిటీవీ వీక్షకుల నుంచి వెల్లువలా అభ్యర్ధనలు. అయితే.. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని నరేంద్రచౌదరి బలమైన ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే గతంలో కనివినీ ఎరుగని ఉత్సవం. అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన ఉత్సవం, భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు. వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా….. పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది.

కోటిదీపోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. సరిగ్గా సాయంత్రం ఆరుగంటలకు కైలాసానికి వినపడేలా శంఖారావం మిన్నంటుతుంది. ఆ వెంటనే వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. వెనువెంటనే శివయ్యకు స్వాగతం పలుకుతూ ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా స్వరార్చనలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, విశేష పూజలు, కల్యాణోత్సవాలు, వాహనసేవలు, జగద్గురువుల ఆశీస్సులు, దీపారాధనలు, లింగోద్భవాలు, సప్తహారతులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు… ఇలా ఒకటేమిటీ కోటిదీపోత్సవంలోని ప్రతీ ఘట్టమూ మహాద్భుతమే.

ముక్కోటి దేవతలు తరలిరాగా…

కార్తికమాసాన్ని హరిహరప్రియం అంటారు. ఈమాసంలో శివకేశవుల సమక్షంలో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటిదీపాల వెలుగుతో సమానమని శాస్త్రవచనం. అటువంటి కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టదామాల నుంచి కోటిదీపోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం.

శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. తిరుమల, యాదాద్రి, సింహాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం, ఒంటిమిట్ట, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు… ఇంద్రకీలాద్రి, అలంపురం, కంచి వంటి శక్తిపీఠాలు. శివపుత్రుల నిలయాలైన కాణిపాకం, మోపిదేవి ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీపోత్సవ వేదికపై కొలువుదీరతారు. భక్తుల సమక్షంలో విశేష పూజలు స్వీకరిస్తారు. కోటిదీపాల మండపమే కల్యాణ వేదికకాగా.. వైభవోపేతంగా పరిణయోత్సవాలు జరిపించుకుంటారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు… పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం, కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్రకలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. గ్రహదోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు.

శ్రీవేంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి ఇలాంటి ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం. ఈ ఏడాది ఇటువంటి మరిన్ని విశేష పూజలు అనేకం ఉంటాయి.

గురుదేవో మహేశ్వరః

ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠం పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీవిద్యానృసింహభారతిస్వామి, ఉడపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్థవిద్యాగురుకులం శ్రీదయానంద సరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం భక్తిటీవీ అదృష్టం. శృంగేరి శంకరాచార్య శ్రీశ్రీశ్రీభా రతీతీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య శ్రీశ్రీశ్రీనిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య శ్రీఅవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు అవదూత దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి శ్రీవీరేంద్రహెగ్దే, అక్షయపాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీజయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానందభారతిస్వామి, రుషికేశ్ పరమార్డ్ నికేతన్ శ్రీచిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు.

ఎందరో మహానుభావులు

కోటిదీపోత్సవ కార్యక్రమం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు… కార్తికమాస వైభవాన్ని.. మన సంస్కృతీ సంప్రదాయల గొప్పదనాన్ని తెలిపే విశిష్ట వేదిక కూడా. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు, బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి, వద్దిపర్తి పద్మాకర్, నోరినారాయణమూర్తి, నండూరి శ్రీనివాస్, డా.ఎన్.అనంతలక్ష్మి వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు తమ ప్రవచనామృతాన్ని అందించారు. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్దప్రతిష్టులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సినీనటులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ, కేంద్రహోం శాఖమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, తెలంగాణ గవర్నర్లుగా సేవలందించిన ఈ.ఎల్.ఎన్.నరసింహన్, తమిళిసై, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు – హైకోర్టు న్యాయమూర్తులు వంటి ఎందరో మహామహులు కోటిదీపోత్సవంలో పాల్గొని అచ్చెరువొందారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చి.. భక్తులై తరించారు.

సువర్ణాక్షరాల ఘట్టం

కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు… భక్తిటీవీ ప్రస్థానంలో సైతం చెరిగిపోని బంగారపు అక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టం. కోటిదీపోత్సవం – 2023. మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు సాక్షాత్తూ దేశప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్రమోది విచ్చేయడం ఓ అపూర్వ జ్ఞాపకం. పదేళ్లకుపైగా ప్రతిఏటా జరుగుతున్న ఈ మహాదీపోత్సవం గురించి తెలుసుకుని రచన టెలివిజన్ ఛైర్మన్ నరేంద్రచౌదరి ఆహ్వానం మేరకు ప్రధాని విచ్చేశారు. దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించారు. తిరుమల శ్రీనివాసునితోపాటు.. భద్రాద్రి రామయ్య, శ్రీశైల మల్లికార్జునుని ఆశీస్సులను స్వీకరించారు. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేశ ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారి.

సప్తహారతులు.. మహానీరాజనాలు

ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథమహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటిదీప కాంతుల నడుమ జరిగే అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణంలో ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు.

ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా. అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు… ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని ఉత్సవమిది. కోటిదీపాలు వెలిగించడమంటే మాటలు కాదు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని నోళ్లు నొక్కుకున్నవారూ ఉన్నారు. కానీ ముక్కోటి దేవతల అనుగ్రహం.. జగద్గురువుల ఆశీస్సులు.. భక్తుల సహకారం…. కార్యక్రమ ప్రణాళిక… సిబ్బంది అంకితభావం వెరసి ప్రతిఏటా అద్భుతరీతిలో కార్యక్రమం కొనసాగుతోంది.

నటరాజుకు కళాంజలి

తాండవప్రియుడైన శివునికి కళానీరాజనం అర్పించే మహాద్భుత ఉత్సవం కూడా ఇదే. అందెల రవళులు ఘల్లుఘల్లుమంటాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలకే కాదు.. జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహిని అట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీపోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గివాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.

రండి.. తరలిరండి

భక్తిటీవీ కోటిదీపోత్సవ అపూర్వ యజ్ఞం మరోమారు జరగనుంది. కార్తికమాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ అధినేత శ్రీతుమ్మల నరేంద్రచౌదరి గత పన్నెండేళ్లుగా భక్తిటీవీ కోటిదీపోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా నిర్విరామంగా ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్నారు. ఎలాంటి రుసుములు లేకుండా… ఏ విధమైన ఆంక్షలు లేకుండా.. కోటిదీపాలు స్వయంగా వెలిగించుకునే ఏకైక పుణ్యప్రద ఉత్సవమిది. మరెక్కడా జరగనటువంటి దివ్యదీపాల సంరంభమిది. ఈ వేదికపైకి ఎందరో సాధుసన్యాసులు, ప్రవచన కర్తలు విచ్చేసి తమ సందేశాలను వినిపిస్తున్నారు.

ఎన్నెన్నో దేవతా కల్యాణాలు జరుగుతుంటాయి. ఎంతోమంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తుంటారు. కోట్లాది భక్తుల సాక్షిగా జరిగే మహత్తరమైన వేడుకకు భక్తులందరికీ భక్తి టీవీ సాదర స్వాగతం పలుకుతోంది……. ఇది మీ ఉత్సవం. సకలదేవతలను దర్శించే ఉత్సవం. ఈ మహాద్భుత ఉత్సవంలో పాల్గొనేందుకు….. రండి.. తరలిరండి. మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి. 2024 నవంబరు 9 నుంచి నవంబరు 25 వరకు నవంబర్ 2024.

వేదిక : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం
సమయం : ప్రతిరోజూ సా. 5.30 నుంచి. 13
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఆస్తిక మహాశయులందరికీ ఇదే మా ఆహ్వానం.

Share this post with your friends