ఇవాళ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా రామయ్య కల్యాణానికి అన్ని దేవాలయాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమంతా రామ జపంతో మునిగి తేలుతోంది. కళ్లు మూసుకుని తెరిస్తే ఎదుట శ్రీ సీతారాములు సాక్షాత్కరిస్తున్నారు. గధ ధారి రూపాన్ని ప్రజాలంతా గుండెల్లో నింపుకుంటున్నారు. రామయ్య కల్యాణాన్ని లోక కల్యాణంగా భావిస్తూ హిందువులంతా భక్తి భావంలో మునిగి తేలుతున్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణం ఉదయం 10:30 గంటకు ప్రారంభం కానుంది. అక్కడ ప్రారంభమైన వెంటనే దేశంలోని అన్ని దేవాలయాల్లో స్వామివారి కల్యాణం ప్రారంభమవుతుంది.
ఇక దేశంలోని ఒక్కో రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓ ఆలయంలో స్వామివారి కల్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా హిజ్రాలు, జోగినిలు, శివపార్వతులు ఉండనున్నారు. ఆ ఆలయం మరెక్కడో లేదు. వేములవాడలో ఉంది. వేములవాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఉదయం 11:59 గంటలకు అభిజిత్ లఘ్నంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. నేటి సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. రాముల వారి కల్యాణం నేపథ్యంలో ఆలయంలో కోడె మొక్కు మినహా అన్ని పూజలు రద్దు చేశారు.