144 ఏళ్లకోసారి మాత్రమే జరిగే అతి పెద్ద మతపరమైన వేడుక కావడంతో మహాకుంభమేళాకు కనివినీ ఎరుగని రీతిలో భక్తులు హారజరవుతున్నారు. 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తే.. ఇప్పటికే దాదాను 42 కోట్ల మంది మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలుస్తోంది. దేశ విదేశాల నుంచి రోజుకు కోటి మందికి పైనే భక్తులు మహాకుంభమేళాకు వస్తున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటోంది. దీంతో చాలా మందికి వెనక్కి వెళ్లాలంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్గమధ్యంలోనే భక్తులు ఇరుక్కుపోయి నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాగ్‌రాజ్ ఏయిర్ పోర్టు నుంచి త్రివేణి సంగమం వరకూ హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు యూపీ ఎకో టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు, ప్లై ఓలా భాగస్వామ్యంతో ఈ హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. విమానం ద్వారా.. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే భక్తులు.. ఈ హెలికాప్టర్ సేవలు వినియోగించుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా మహాకుంభమేళాకు చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టులో దిగి 23.7 కిలో మీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమానికి హెలికాప్టర్‌లో డైరెక్టుగా వెళ్లాలంటే.. ఒక్కో ప్రయాణికుడు రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఇందులోనే హెలికాప్టర్ ఛార్జీ, బోట్ ట్రాన్స్‌పోర్ట్, ఇతర సేవలు కూడా యాడ్ అయి ఉంటాయి. ఈ హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకోవాలంటే ముందుగానే ఫ్లై ఓలా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.