
తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అని ఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య సర్వోత్తమరావు అన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 74వ వర్థంతిని గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు మాట్లాడుతూ, ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన పద్య సాహిత్యంతోపాటు కథలు, కథానికలు కూడా రచించారని వివరించారు.
శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి మిత్ర మండలి శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఆంధ్ర వాఙ్మయ విస్తృతికి వేటూరి వారు ఎంతో కృషి చేశారని, గ్రంథ విమర్శనలో ఆయనకు మరెవరూ సాటి రారని చెప్పారు. ఆయన రచించిన “నీతి-నిధి” పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని, అందులో ప్రతి ఒక్కరు దయ కలిగి ఉండాలని తెలియజేశారన్నారు. 98 శాతం వ్యాధులు మనస్సు నుండి ఉద్భవిస్తాయని, యోగం ద్వారా వ్యాధులు దూరం అవుతాయని వివరించారు. ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి ప్రసంగిస్తూ, శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి తెలుగు భాషకు విశేష సేవలు చేశారన్నారు. ప్రాచీన రాగి రేకుల్లోని కీర్తనలను వెలుగు చూడటానికి బాటలు వేశారన్నారు. అన్నమయ్య కీర్తనలు వెలుగు చూశాక ఎంతోమంది ఆ కీర్తనలు ఆలపిస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడని వివరించారు.
