
ప్రతి పూజ, శుభకార్యానికి ముందుగా వినాయకుడిని పూజించుకుంటాం. ఇలా చేస్తే విఘ్నరాజాధిపతి తలపెట్టిన ఎలాంటి కార్యానికి ఆటంకం కలిగించడని నమ్మకం. అసలు వినాయకుడిని మనసులో తలచుకోగానే ఒక రూపం గుర్తొస్తుంది. ఏనుగు ముఖం, తొండం, ఏకదంతం, పెద్ద చెవులతో ఇతర దేవతలందరికీ భిన్నంగా కనిపిస్తాడు. ఏ ఆలయంలోనైనా గణపతి ఇలాగే కనిపిస్తాడు. కానీ ఒక ఆలయంలో మాత్రం ఇలా కనిపించడు. ఆసక్తికరంగా ఇక్కడి గణేశుడు మానవ ముఖంతో మనకు దర్శనమిస్తాడు. మరి నరముఖ గణపతి ఎక్కడున్నాడు? ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రంలోని తిలతర్పణపురి అనే గ్రామంలో నరముఖ గణపతి కొలువు దీరాడు. ఈ ఆలయం వాస్తవానికి ముక్తీశ్వరుడిది. ఈ ఆలయ ప్రాంగణంలోనే నరముఖ గణపతి ఉంటాడు. ఇక్కడి గణపతి ఆలయాన్ని ఆది వినాయక ఆలయం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో తొండం లేకుండా వినాయకుడు కనిపించే ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయానికి తిల తర్పణ పురి అనే పేరు రావడం వెనుక కూడా ఓ కథ ఉంది. తిలలు అంటే మనందరికీ తెలిసిందే.. నువ్వులు. తర్పణం అంటే వదలడం.. పురి అంటే స్థలం. ఈ ఆలయంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అందుకే ఈ గ్రామానికి తిల తర్పణ పురి అని పేరు వచ్చింది.
