మైసూర్‌లో అంగరంగ దసరా ఉత్సవాలు.. తొలిరోజు ఏం జరిగిందంటే..

మైసూర్ దసరా ఉత్సవాలు ఈనాటివి కావు.. 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అందుకే రాష్ట్ర పండుగగా ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజ వేషధారణలో మెరిసిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఈ దసరా మహోత్సవాలను ప్రారంభించారు. అందంగా ముస్తాబైన మైసూర్ ప్యాలెస్‌లోని ప్రైవేటు కోర్టులో యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ వేషధారణలో అలనాటి రాజుల కాలాన్ని గుర్తు చేశారు. రాజాధిరాజ రాజా మార్తాండ రాజా కులతిలక యదువీర్ పరాక్.. బహు పరాక్.. బహు పరాక్.. వంధి మగధరుడు బహుపరాక్ అంటూ రాజుల కాలం నాటి వెల్‌కమ్ మరోసారి మైసూర్ ప్యాలెస్‌లో ఆవిష్కృతమైంది.

నవరాత్రుల తొలి రోజున మైసూరులో ప్రైవేట్ దర్బార్‌ని నిర్వహించారు. అనంతరం యదువీర్ సింహాసనం వద్దకు వెళ్లి సింహాసనానికి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మంగళహారతి ఇచ్చారు. సింహాసనం పక్కనే కూర్చొని నవగ్రహ పూజ నిర్వహించిన అనంతరం సింహాసనాన్ని అధిరోహించారు. యదువీర్ భార్య త్రిషికాకుమారి ఆయనకు పాదపూజ చేశారు. దివానులు సింహాసనం ముందు నిలబడి నమస్కరించిన మీదట రాజభవన ఆలయాలు, చాముండిబెట్ట, ఉత్తనహళ్లి బెట్ట సహా పలు ఆలయాల నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడయార్‌కు అందజేయగా ఆయన స్వీకరించారు. మైసూర్ రాష్ట్ర గీతాలాపన అనంతరం యదువీర్ సింహాసనం నుంచి దిగి ప్రైవేట్ దర్బార్‌ను ముగించారు.

Share this post with your friends