జ్యేష్ఠ పౌర్ణమి శుభవేళ అప్పన్న స్వామి వారి గోశాలలో ఘనంగా ఏరువాక ఉత్సవం

హిందూమత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమి తిథులలో జ్యేష్ఠ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిండు చంద్రుడు పౌర్ణమి తిథి వేళ ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పున్నమి అని పేరు వచ్చిందని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో 21 జూన్ 2024 శనివారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పున్నమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజను చేస్తారు. ఇది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ సమయంలో తమ పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు.

ఈ సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృష్ణాపురం గోశాల యందు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ఈ వేడుకను శాస్త్ర పరంగా ప్రారంభించారు. ఏరువాక సందర్భంగా ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కార్య నిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి నాగలపట్టి భూమిని దున్ని వ్వవసాయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వారు మాట్లాడుతూ ఏరువాక రైతులు పండగని వేద కాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారని, ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా పిలుస్తారని ఆయన తెలిపారు.

భూమాతకు ప్రత్యేక పూజలు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు ప్రారంభం కాగానే రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టేకాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారని ఆయన తెలియజేశారు. ఏరువాక ఉత్సవంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఏ ఈ హరి అప్పారావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends